రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద అంగన్‌వాడీ టీచర్లకు రెండు లక్షలు, సహాయకులకు లక్ష రూపాయల చొప్పున అందిస్తామని తెలంగాణ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. తమకు తీవ్ర నష్టదాయకమైన జిఒ నెం.10ని రద్దు చేయాలంటూ తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో పది రోజులకుపైగా అంగన్‌వాడీలు నిరాహార దీక్షలు, కలెక్టరేట్ల ముట్టడి, పెద్దఎత్తున ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడి చేపట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో ఉద్యోగ విరమణ విషయంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ఎలాంటి ఆందోళనా చెందొద్దని, త్వరలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతూ కొత్త జిఒ జారీ చేస్తామని మంగళవారం మంత్రి సీతక్క ప్రకటించారు. హైదరాబాద్ ఖైరతాబాద్ ప్రాజెక్టు పరిధిలోని రెహమత్‌నగర్ సెక్టర్‌లోని ఎన్ఎస్‌బి నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో ‘అమ్మమాట-అంగన్‌వాడీ బాట’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రితో చర్చించి నాలుగైదు రోజుల్లో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పెర్స్‌కు రిటైర్మెంట్ బెన్‌ఫిట్స్ పెంచే అంశానికి సంబంధించిన కొత్త జిఒ జారీ చేసేలా చూస్తామని తెలిపారు. అంగన్‌వాడీ సిబ్బందికి కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని చెప్పారు. పిల్లలు అమ్మ ఒడిలో ఎంత సురక్షితంగా ఉంటారో.. అంగన్‌వాడిలోనూ అంతే సురక్షితంగా ఉండేలా సేవలు అందిస్తామని అన్నారు.