రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై పోరాడే ఏకైక సంఘం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. కొన్ని జర్నలిస్టు సంఘాలు పాలక వర్గాల కొమ్ముకాస్తూ జర్నలిస్టుల సంక్షేమాన్ని, సమస్యల పరిష్కారాన్ని విస్మరిస్తున్నాయని విమర్శించారు.టీడబ్ల్యూజేఎఫ్ సంఘం ఒక్కటే జర్నలిస్టుల పక్షాన పోరాడుతుందన్న విషయాన్ని యావత్ జర్నలిస్టులు గ్రహిస్తున్నారని ఆయన
అన్నారు.మంగళవారం భువనగిరి పట్టణంలోని టీఎన్జీవో భవనంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) యాదాద్రి-భువనగిరి జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పెరబోయిన నర్సింహులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మామిడి సోమయ్య మాట్లాడుతూ… జర్నలిస్టులు నిత్య జీవితంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తెస్తూ, ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటున్న జర్నలిస్టుల జీవితాల్లో అంధకారం మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఇంటి స్థలం ఉన్న వారికి ప్రభుత్వం ఇస్తామన్న ఐదులక్షల ఆర్ధిక సహాయం పథకాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేసీ ఇండ్ల నిర్మాణానికి సహకరించకరిం
చాలని ఆయన కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో జర్నలిస్టుల పిల్లలకు ప్రత్యేక కోటా ద్వారా సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్ చార్జి పిల్లి రాంచందర్, రాష్ట్ర కార్యదర్శి కొలుపుల వివేకానంద, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల జలంధర్, జిల్లా ఉపాధ్యక్షులు మొరిగాడి మహేష్, ఎల్లబోయిన శ్రీహరి, పాక జహంగీర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చిలువేరు అంజయ్య, దుగోజు నాగాచారి, సహాయ కార్యదర్శి చింతల రాజు తదితరులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ మొదటివారంలో జిల్లా మహాసభ
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ యాదాద్రి- భువనగిరి జిల్లా మహాసభ, నూతన కమిటీ ఎన్నిక సెప్టెంబర్ మొదటి వారంలో జరపాలని జిల్లా కమిటీ సమావేశం నిర్ణయించింది. జిల్లా మహాసభకు ముందు నియోజకవర్గాల మహాసభలు నిర్వహించి, సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సమావేశం నిర్ణయించింది.