బ్రిటీష్ వలస పాలన కాలం నాటి చట్టాలకు ముగింపు పలుకుతూ న్యాయ వ్యవస్థలో కీలక మార్పులను తీసుకువస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం సోమవారం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులతో జీరో ఎఫ్‌ఐఆర్, ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు, ఎస్‌ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ మోడ్ల ద్వారా సమన్లు జారీ చేయడం, క్రూరమైన నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను తప్పనిసరి వీడియోగ్రఫీ వంటి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వటమే కాకుండా రాజద్రోహం పదాన్ని తొలగించారు. భారతీయ న్యాయ సంహితలో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే కొత్త పదాన్నిచేర్చారు.

రాజ్యాంగ ఆదర్శాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత సమాజంలో నేరాలను త్వరగా పరిష్కరించేందుకు ఈ మార్పులు దోహదపడతాయని కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి. కొత్త చట్టాలు పౌరులకు శిక్షలు విధించడం కంటే న్యాయం అందించడానికి ప్రాధాన్యం ఇస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వలసవాద నేర న్యాయ చట్టాల ముగింపును సూచిస్తూ, అందరికీ న్యాయం చేయాలన్న తలంపుతో కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయని వెల్లడించారు. చట్టాలు కేవలం పేరు మార్పుకే పరిమితం కాదని, చట్టాల్లో పూర్తి సవరణలను తీసుకొచ్చామన్నారు. ఈ నూతన చట్టాలను పూర్తిగా భారతీయులే రూపొందించారని, దీని ఆత్మ, శరీరం పూర్తిగా భారతీయమేనని అన్నారు. ఈ కొత్త చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని నిర్ధారిస్తాయని హోం మంత్రి తెలిపారు. ఈ కొత్త చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తైన 45 రోజుల్లోపు తీర్పు ఇవ్వాలి. మొదటి విచారణ నుంచి 60 రోజులలోపు అభియోగాలు నమోదు చేయాలి. అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని సంరక్షకుల సమక్షంలో మహిళా పోలీసు అధికారి నమోదు చేయాలి. అత్యాచార బాధితురాలి వైద్య నివేదికలు ఏడు రోజుల్లో రావాలి. పిల్లలను కొనడం, విక్రయించడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. మైనర్ సామూహిక అత్యాచారానికి జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధిస్తారు.

భారతీయ శిక్షాస్మృతిలోని 511 సెక్షన్ల స్థానం లో ఇప్పుడు 358 సెక్షన్లు మాత్రమే ఉంటాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 18 సెక్షన్లు ఇప్పటికే రద్దు చేశారు. డిజి లాకర్‌లో సాక్ష్యాలు భద్రం సాక్షుల వాంగ్మూలాలు, ఆడియో, వీడియో సాక్ష్యాలన్నింటినీ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన డిజి లాకర్‌లో భద్రపరుస్తారు. క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానం చేయడం వల్ల సాక్ష్యాలను ఆన్‌లైన ద్వారా పంపుతారు. దీని వల్ల ఆధారాలు మాయం చేయడం సాధ్యం కాదు. పెళ్లి చేసుకుంటానన్న తప్పుడు వాగ్దానాలు ఇచ్చి లైంగిక సంబంధాలు పెట్టుకుని మహిళలను విడిచిపెట్టే వారికి కూడా కొత్త చట్టాల్లో కఠిన నిబంధనలు రూపొందించారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ను ప్రవేశపెట్టడం వల్ల ఒక వ్యక్తి అధికార పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీసు స్టేషన్‌లో అయినా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయవచ్చు. కొత్త చట్టాల ప్రకారం మహిళలపై నేరాలకు సంబంధించి బాధితులు కేసు పురోగతిపై 90 రోజులలోపు అప్‌డేట్ పొందేందుకు అవకాశం కల్పించారు. క్రిమినల్ కేసుల విచారణలో ఆలస్యాన్ని నివారించేందుకు కోర్టులు గరిష్ఠంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేయాలి.

ఆర్థిక సంబంధ నేరాల్లో నిందితుల ఆస్తులు, నేరం ద్వారా సంక్రమించిన సొమ్ముతో వారు కొన్న స్థిర, చరాస్తులనూ జప్తు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయమేమంటే న్యాయ వ్యవస్థలో ఏవైనా మార్పులు ప్రతిపాదిస్తే, వాటిని ఆమోదించడానికి, అమలు చేయడానికి ముందే పబ్లిక్ డొమైన్‌లో చర్చించాలి. సరైన సంప్రదింపులు లేకుండా, పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన సూచనలను పట్టించుకోకుండా, బిల్లు ముసాయిదాను బహిరంగంగా అందుబాటులో ఉంచకుండా ఈ చట్టాలను ప్రజలపై బలవంతంగా రుద్దారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాల స్థానంలో వీటిని తీసుకొచ్చామని చెప్పినా ఇందు లో గత చట్టాల్లోని అన్ని నిబంధనలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మరింత కఠినతరం చేశారు. ఉదాహరణకు దేశద్రోహ చట్టం కింద శిక్షించేందుకు ఉద్దేశించిన ఐపిసిలోని సెక్షన్ 124 (ఒక సాధారణ బ్రిటీష్ రాజ్ చట్టం)ను సుప్రీం కోర్టు కొట్టేసినా, ఈ కొత్త చట్టంలో అలాగే ఉంచారు. మూడేళ్ల జైలు శిక్ష విధించే నిబంధనను ఏడేళ్లకు పెంచారని, అలాగే ప్రజలు, నాయకులు సమావేశాలు నిర్వహించుకుంటే ఎవరినైనా ఉగ్రవాదులుగా ప్రకటించవచ్చని, అన్ని కార్మిక సంఘాల కార్యకలాపాలను ఈ నిబంధన కిందకు తీసుకొస్తారని పేర్కొన్నాయి.

వివిధ విభాగాలకు చెందిన అనేక నిబంధనలను మార్చడమనేది తీవ్ర గందరగోళానికి దారి తీస్తుంది. ఇది న్యాయ స్థానాల్లో కేసుల పెండింగ్‌కు దారితీస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దిగువ కోర్టుల్లో 6 కోట్ల 40 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, వాటిని విచారించడమే కష్టంగా ఉన్న నేపథ్యం లో ఈ చట్టాల వల్ల పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసే అన్ని అధికారాలు ఎస్‌హెచ్‌ఒలకు ఉండడంతో కేసు నమోదు చేయడం కూడా వారి విచక్షణాధికారంగా మారుతుంది. ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడం ప్రతి పౌరునికీ ఉండే హక్కు, కానీ ఇప్పుడు అది ఎస్‌హెచ్‌ఒ విచక్షణకు వదిలేస్తున్నారు. పోలీసు కస్టడీ వ్యవధిని 15 రోజుల నుంచి 90 రోజులకు పెంచారు, తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన తెలిపే నిరసనకారులు, ఘెరావ్ చేసే కార్మికులపై కేసు నమోదు చేయడానికి పోలీసులకు అధికారం ఉంది. అయితే ఇది పాలక యంత్రాంగం, దాని మార్గదర్శకుల ఆదేశాలకు అనుగుణంగా అణచివేతను ప్రదర్శించే పోలీస్ రాజ్‌ను తలపిస్తుంది. న్యాయ స్థానాలను వర్ణించడానికి కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనే నిర్వచనమనే నిబంధనలలో ఉన్న పదం కూడా, ఇప్పుడు కేవలం కోర్టుగా మాత్రమే ఉంటుంది. రవాణా రంగ కార్మికుల నుంచి వచ్చిన ప్రతిఘటనతో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించిన తీవ్రమైన నిబంధనలపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం, ఆ సెక్షన్లు అమలు చేయబోమని చెప్పింది, కానీ ప్రభుత్వం వాటిని రద్దు చేయలేదు.

ఈ చట్టాలను ఉచ్ఛరించడానికి హిందీ భాషను ప్రయోగించారు, అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 348, అధికార భాషల చట్టం ప్రకారం పార్లమెంట్, శాసన సభల అన్ని అంశాలు ఇంగ్లీష్‌లో ఉండాలనే ఆదేశాలున్నాయి. నోట్ల రద్దు మాదిరిగానే, ఈ చట్టాలు కూడా చాలా ప్రమాదకరమైనవే. 19వ శతాబ్దం తరువాత సమూల మార్పులు చేయడం ఇదే మొదటిసారి. ఈ చట్టాలను తీసుకుని రావడం వల్ల కొన్ని తప్పిదాలు జరిగాయి. కొత్త క్రిమినల్ చట్టాలను ఏకపక్షంగా పార్లమెంట్‌లో ఆమోదించారు. ఈ కొత్త చట్టాలు డిసెంబర్ 2023 నాడు పార్లమెంట్‌లో ఆమోదం పొందాయి. అయితే వీటిని ఆమోదించే ముందు పార్లమెంట్‌లోని ఉభయ సభల్లోని 144 సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ కొత్త చట్టాలపై ఎలాంటి చర్చ జరగకుండా కొన్ని నిమిషాల్లో పార్లమెంట్‌లో ఆమోదం పొందాయి. కొత్త చట్టాలను పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపించారు. అయితే కమిటీ విభేదించిన అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. అంటే ఈ చట్టాల పునాది అనేది సరిగ్గా లేదు. రాజద్రోహం అన్న నిబంధనని చట్ట పరిధి నుంచి తొలగించామని ప్రభుత్వం చెబుతున్నది. అయితే దాన్ని మరో నిబంధనలో పొందుపరిచారు. ఈ నిబంధనని చట్టం నుంచి తొలగిస్తున్నామని హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో చాలా గర్వంగా చెప్పారు. అది అంతమైందని కూడా అన్నారు. కానీ ఆ నిబంధన బిఎన్‌ఎస్‌లో మరో రూపంలో వచ్చేసింది.

రాజద్రోహం అన్న పదాన్ని మాత్రమే తొలగించి, అంతకన్నా కఠినమైన నిబంధన సెక్షన్ 152ని చేర్చారు. దాని ప్రకారం దేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు, సమగ్రతకి భంగం కలిగిస్తే ఈ నిబంధన ప్రకారం నేరం అవుతుంది. ఈ నేరం చేసిన వ్యక్తులకు జీవితఖైదు గానీ, ఏడు సంవత్సరాల శిక్షనుగానీ, ఈశిక్షతో పాటు జరిమానాని కూడా కోర్టులు విధిస్తాయి. కొత్త చట్టం ద్వారా రాజద్రోహం అనే దాన్ని దేశద్రోహంగా మార్చారు. రాజద్రోహాన్ని మించినదాన్ని రూపొందించారు. పాత నిబంధనలో సార్వభౌమత్వం, సమగ్రత అన్న పదాలు లేవు. అవి ఈ కొత్త నిబంధనలో చేర్చారు. అంటే ఈ కొత్త నిబంధన సెడిషన్‌కి మించిన నిబంధన. దీన్ని ప్రభుత్వం తొలగించింది ఏమీలేదు. ఇంకా చెప్పాలంటే అదనపు పదబంధాలను ఈ నిబంధనలో చేర్చింది. ఈ రెండు చట్టాలు అంటే పాత చట్టాలు, కొత్త చట్టాలు రెండూ అమల్లో ఉండటం వల్ల సత్వర న్యాయానికి విఘాతం కలుగుతుంది. పాత చట్టాలని ప్రక్షాళన చేసి కొత్త చట్టాలు రావడం వల్ల సత్వర న్యాయం లభిస్తుందని ప్రభుత్వం చెప్పడంతోపాటు, అందుకోసం చట్టంలో చాలా విషయాలకి కాల పరిమితిని ఏర్పాటు చేశారు. అయి తే అందుకు తగిన చర్యలు తీసుకోకుండా కాల పరిమితిని ఏర్పాటు చేయడం వల్ల ఆశించిన ఫలితాలు రావు.