కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్‌లోని సిటీన్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డీఎస్ మృతి చెందారు. డీఎస్ పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. పార్లమెంట్ సమావేశాల కోసం దిల్లీలో ఉన్న డీఎస్ కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటారు.
అనంతరం భౌతిక కాయాన్ని నిజామాబాద్‌కు తరలిస్తారు. ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. తండ్రి మృతి పట్ల కుమారుడు, ఎంపీ ధర్మపురి అర్వింద్ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం దిల్లీలో ఉన్న ఆయన, ‘అన్నా అంటే నేనున్నా అని ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇకలేరు. నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే. ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే. ప్రజలను ప్రేమించు, ప్రజల కోరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్నా.. నువ్వు ఎప్పటికి నాతోనే, నాలోనే ఉంటావు’ అంటూ ట్వీట్ చేశారు.